ఏ మనిషికి ఆయినా తన ఆశల్ని , ఆశయాలని , ఆలోచనలని అభివృద్ధి పథంలోకి నడిపించాలంటే కావాల్సింది లక్ష్యం. మనం అనుకున్న ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు కావాల్సింది ఏకాగ్రత , నిశ్చలమైన మనస్సు , ఆఖుంటిత దీక్ష ఏదైనా సాధించగలం అనే పట్టుదల ,పెద్దల యొక్క ఆశీస్సులు.
ఇవన్నీ ఉంటే ఎవరైనా సరే ఆ లక్ష్యాన్ని ఛేదించుకుని విజయఫథానికి దూసుకెళతారు.
మన లక్ష్యం అలక్ష్యం కాకూడదoటే ఎంతో కృషి చెయ్యాలి, ఎన్నో అవరోథాలను ఎదుర్కోవాలి ,సమన్వయంతో వ్యవహరించాలి, శోధించాలి , గురి తప్పకుండా చేధించాలి, అప్పుడే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు.
దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం.
కౌరవులు , పాండవులు ద్రోణాచార్యుల వద్ద విద్యనభ్యసించేవారు. ఒకసారి కౌరవులకి,
పాండవులకి మధ్య ఒక వివాదం వచ్చింది ,అదేంటంటే ద్రోణాచార్యులవారికి ఎవరు ప్రియ శిష్యుడు అని ,కౌరవులేమో దుర్యోధనుడు అని ,పాండవులేమో అర్జునుడు అని వాదించుకుంటూ ఉండగా ద్రోణాచార్యులవారు అక్కడికి వచ్చారు. సంగతి తెలుసుకుని ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు ఎందుకంటే ఆయనకి అర్జునుడి మీద ఆపేక్ష ఎక్కువ ఆ విషయం తెలిస్తే కౌరవుల నుంచి పాండవులకి ఆపద వాటిల్లుతుంది అందుకే ఇలా అన్నారు, నాకు ప్రతి ఒక్కరు సమానమే అందులో సందేహము లేదు అని.
కానీ దానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు , ఎవరో ఒకరి పేరు చెప్పాల్సిందే అని గురువుగారిని ఒత్తిడి చేశారు. అప్పుడు ద్రోణాచార్యులవారు ఇలా అన్నారు, మీకు నేనొక పరీక్ష పెడతాను ,అందులో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళే నాకు ప్రియ శిష్యులు అవుతారు అని చెప్పి ఇందుకు ఒప్పుకుంటేనే పరీక్ష పెడతాను లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి అన్నారు.
శిష్యులు అందరూ పందానికి ఒప్పుకుని ఆ పరీక్ష ఏంటో చెప్పమన్నారు. అప్పుడు ద్రోణాచార్యులవారు అందరిని విల్లంభులతో పరీక్షకి సిద్ధం కమ్మని చెప్పారు. అందరూ సర్వ సన్నద్ధులై గురువుగారి ఆజ్ఞకి ఎదురు చూస్తున్నారు. అప్పుడు ద్రోణాచార్యులవారు ఇలా చెప్పారు , ఎవరైతే గనుక ఆ కనిపిస్తున్న చెట్టు మీద ఉన్న పక్షి కన్నుని చేధిస్తారో వారే నా ప్రియమైన శిష్యుడు అని శెలవిచ్చారు.
ఇది విన్నాక అందరూ దానికి సమ్మతించి ఒకరి తర్వాత ఒకరుగా విల్లుని ఎక్కుపెట్టి గురి చూసి
బాణాన్ని వదిలారు కానీ ఎవ్వరూ కూడా ఆ పక్షి కన్నుని తాకలేక పోయారు , చివరిగా అర్జునుడు, గురువుగారికి నమస్కరించి విల్లుని ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు అది తిన్నగా వెళ్ళి పక్షి కన్నుని పెకిలించింది. అది చూసి అందరూ హర్షద్వానాలతో అర్జునుడికి జేజేలు పలికారు, దుర్యోధనుడు మనస్సులో అసూయతో రగిలిపోయాడు కానీ అది పందెం అన్న విషయం గుర్తుకు వచ్చి తనని తాను సంభాళించుకున్నాడు.
ఇంతలో ద్రోణాచార్యుల వారు ఒక్కరొక్కొరిని పిలిచి బాణం గురిపెట్టినప్పుడు వారికి ఏమి కనిపించిందో చెప్పమన్నారు, ఒకొక్కరూ చెట్టు ,పుట్ట, ఆకులు, కొమ్మలు, ఆకాశం అంటూ రకరకాలుగా చెప్పారు. చివరిగా ఆయన అర్జునుడిని పిలచి నాయనా అర్జునా ఆ పక్షి కన్నుని ఒక్క బాణంతోనే ఎలా పెకిలించగలిగావో అందరికి వివరించి చెప్పు అని అడిగారు. అప్పుడు అర్జునుడు ఆచార్య, నాకు విల్లు ఎక్కుపెట్టినప్పుడు గుర్తుకు వచ్చింది మీరు చేదించమని చెప్పిన ఆ పక్షి కన్ను, అది తప్ప నా ఆలోచనలోకి ఇంకో విషయం రానివ్వకుండా దృష్టిని దాని మీదే పెట్టాను , అందుకే దానిని చేదించగలిగాను అని వివరించాడు.
అప్పుడు ద్రోణాచార్యులవారు శిష్యులతో విన్నారు కదా ,మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కావాల్సింది లక్ష్యాన్ని చేరుకోవాలనే తాపత్రయం , నిశ్చలమైన మనస్సు ,ఏకాగ్రత ఇవేమి లేకపొతే మనం ఏ పని చేయలేము, ఇక్కడ అర్జునుడు గురిపెట్టినది పక్షి కన్ను మీద కాదు, తన దృష్టిని తను సాధించాల్సిన లక్ష్యం వైపు గురిపెట్టాడు ,అందుకే విజయాన్ని అందుకున్నాడు అని చెప్పి అర్జునుడిని తన ప్రియ శిష్యుడిగా ప్రకటించారు.
ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే , "మనం చేపట్టిన పని మీద మన దృష్టి ఎక్కుపెట్టితే మనం అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో చేరుకోగలుగుతాము అని ". కథ పాతదే అవ్వొచ్చు కానీ కథనంలో ఉన్న విషయం ప్రతి తరానికి మార్గదర్శకం అవుతుంది.
" లక్ష్యాన్ని నిర్లక్ష్యంతో అలక్ష్యం చేస్తే జీవిత కాలాన్ని భారీ మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తుంది."(కౌరవులే దీనికి ఉదాహరణ)
"ఆ లక్ష్యాన్నే గనుక మనం మన జీవిత బాటగా వేసుకుంటే అది పూల బాటే అవుతుంది ,సలక్షణమైనా జీవితాన్ని అందిపుచ్ఛుకుంటాము."(పాండవులు అనుకున్న లక్ష్యాన్ని అధిగమించారు.)
No comments:
Post a Comment